Wednesday, 19 January, 2011

"మెగా స్టార్" సినిమాటోగ్రాఫర్.సినిమా ఒక దృశ్య మాలిక అయనప్పటికీ.. కథా ప్రధానం కనక..  ప్రేక్షకుడు కథలో లీనం అయిపోతాడు.  మన తెలుగు సినిమా ముఖ్యంగా  మాటల్లో కథ నడుస్తుంటుంది,  కనక చెవులు రిక్కించి వింటుంటాడు. అందుకే కళ్ళ ముందు వొచ్చే అద్భుతమైన చిత్రీకరణని పెద్దగా గుర్తించక పోయినా.. ఆ దృశ్యాలు  సూటిగా అంతః చేతనం లోకి వెళ్ళిపోతాయి.  ఆ ప్రకారం లో సినిమాలోని దృశ్యాలు అంతర్లీనగా పని చేస్తాయి.తదనుగుణంగా హృదయాంతరాళం లో ఎక్కడో ఒక విధమైన  రాసానందం ఉంటూనే ఉంటుంది.
నిన్న ఎందుకో అభిలాష చిత్రం లో ఒక పాట చూస్తున్నపుడు చిత్రీకరణ చాలా సాధారణంగా కనిపించినప్పటికీ కనపడుతున్న దృశ్యం లో ఎక్కడో ఒక అందం దాగి ఉంది అని అనిపించింది. ఓ పాటలో  రాధిక,  చిరంజీవి  కురులలో సూర్య కాంతి అందంగా మెరుస్తుండగా అంటే అందంగా ఇద్దరి మోహము నవ్వుతు  పాటలోని లయ కనుగుణంగా అడుగులు పడుతున్నాయి. ఇళయ రాజా సంగీతం అన్నింటి మీద పై చేయి సాధించినప్పటికీ నా కళ్ళకి ఆ చిత్రీకరణ ఆకట్టుకుంది.  అప్పుడు మళ్లీ  వెనక్కి   వెళ్లి టైటిల్స్ చూసాను..లోక్ సింగ్ గారు సినిమాటోగ్రాఫర్. అప్పుడు గుర్తొచ్చింది  అయన గురించి.  ఇంకొంచం  వెతికితే మరిన్ని  విషయాలు తెలిసాయి.
  హంగు, ఆర్భాటము కనపడకుండా... కథ కి అనుగుణంగా.. ఎక్కడా కథమీద పైచేయి కాకుండా  .. కావలసిన మూడ్ ని అందిస్తూ.. అందంగా, పగలూ ..రాత్రి...ఉదయం.. సాయంత్రం...వర్షం..చలి ఇలా ఇలా కథానుగుణ   వాతావరణం పట్టు జారకుండా   చిత్రీకరణ చేయటం మంచి సినిమాటోగ్రఫీ అనుకుంటే.. అలా ఎన్నో సినిమాలకి మంచి సినిమాటోగ్రఫీ అందించినవారు లోక్ సింగ్ గారు.చిరంజీవి "ప్రతి నాయకుడుగా" వచ్చిన ఇది కథ కాదు తో మొదలు పెట్టి  న్యాయం కావలి, శుభలేఖ , అభిలాష,  కైదీ , హీరో,  గుండా, చాలెంజ్, విజేత, రాక్షసుడు, స్వయం కృషి ,పసివాడి ప్రాణం , దొంగ మొగుడు , రుద్రవీణ, కైదీ నెంబర్ 786 , కొండవీటి దొంగ ..లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో  పాటుగా  చిరు మెగా స్టార్ గా ఎదిగిన  గ్యాంగ్ లీడర్ వరకూ చిరంజీవి గారి మెగా ప్రస్థానం లో   దాదాపు 31 సినిమాలకి ఆయనే ఛాయాగ్రాహకుడు. ఒకే వ్యక్తి  సినిమాటోగ్రాఫర్ గా  ఇన్ని సినిమాలు మరెవరితోనూ చేయలేదు చిరంజీవి గారు. చిరంజీవి  గారిని అత్యంత handsome గా... ఠీవి..దర్జా.. దర్పం..బాగా elevate అయ్యేట్టు చిత్రీకరించింది లోక్సింగ్ గారే .

   సన్నివేశం చిత్రీకరించే  పరిసరాలలో ఉన్నఅందుబాటులో ఉన్న  కాంతి అందిపుచ్చుకొని, దానిని అందంగా వాడుకోవ టము,  కృత్రిమ లైట్స్ ని వాడినప్పటికీ ఆది వాడి నట్టు తెలియకుండా, అందుబాటులో ఉన్న  కాంతి తో చిత్రీకరించి నట్టు  సహజత్వం తీసుకొని రావటము ఆయన ప్రత్యేకత.
 కే. విశ్వనాధ్ గారితో శుభలేఖ..స్వయం కృషి..  స్వర్ణ కమలం  చిత్రాలకి చాయగ్రహణం చేసారు. అన్ని చిత్రాల్లో సహజత్వం ఉట్టిపడుతుంది. నాకు బాగా నచ్చిన చిత్రం స్వర్ణ కమలం


. ఓ పక్క  ప్రకృతి సౌందర్యం, దాంతో  పోటి పడుతున్న భాను ప్రియ గారి అందం..రెండింటినీ  కనువిందు చేయిస్తూ, ఆ నాట్య విన్యాసం మకుటాయమానం అయ్యేట్టు కెమెరా కోణాలను ఎన్నుకొని .. ఆ పాద లయలకి అనుగుణ మైన కెమెరా కదలికలు పట్టు సడలకుండ చిత్రీకరణ జరపటం అయన నైపుణ్యానికి ఓ ప్రతీక. 
 ఆయన ఛాయాగ్రహణాన్ని మరోసారి కొనియాడుతూ ..
చక్రధర్

1 comment:

laxisisira naidu said...

s chakri ur right grt cinimatographer in telugu film industry