Thursday 30 June, 2011

ఎవరైనా ఉన్నారా..

మనదేశంలో...ముఖ్యంగా తెలుగు సినిమా నాటకం నుంచి వచ్చిందే.. నాటకాలు గా వేసే రామాయణ భారత భాగవత కథలని  చిత్రీకరించి సినిమాలు గా తీసారు. అదే western లో సినిమా అనే మాధ్యమాన్ని నూతన దృశ్య మాధ్యమం గా గుర్తించి  సంపూర్ణంగా అర్థం చేసుకొని.. త్వరగానే నాటకం నుండి విడి...పోయి ఒక కొత్త రసాత్మక ..జనరంజక మాధ్యమం గా ఆవిర్భవించింది.  కాని మనం దాన్ని  అర్థం చేసుకోవటం లో చాలానే వెనకబడి పోయాం. అలా మొదలైన సినిమా మెల్లిగా సాంఘీక విషయాలని..మనిషి అంతర్గ్హత భావోద్వేగాల్ని..ఘర్షణ నీ కథలుగా చేసుకోనో కొన్నేళ్ళు బాగానే ఉంది. కాని ఎప్పుడయితే VHS వచ్చి ..హాలీవుడ్ సినిమా కథని కాపి కొట్టటం మొదలైందో అప్పట్ని నుంచి మన సృజనాత్మకత చచ్చిపోయింది. కథలు ..పాటలు..డాన్సులు  ఇలా అన్నీ కాపీ కొట్టటం మొదలైంది. ఆ కాస్సేట్టేస్ జనాలకి అందుబాటులో లేక ..కొంతకాలం ఈ కాపి కొత్తదనాన్ని బాగానే ఆదరించారు. కాని ఎంతకాలమని ఆదరిస్తారు ? అందుకే ప్రస్తుత తెలుగు సినిమా తన ఉనికిని కోల్పోయింది. అటు బాలివుడ్లో ప్రతుత metro culture కి అద్దం పట్టే విధంగా సినిమాలు వస్తుంటే.. ఇటు తమిళ, మళయాళ సినిమా తమ సంకృతి..జీవన విధానాన్ని ..human  emotions ని కలగలుపుకొని  తమకంటూ ఒక శైలి ని ఏర్పరచుకున్నారు. బెంగాలి ముందునుంచే సుప్రసిద్ధ రచనలని తెరకెక్కిస్తు...భావ..కళాత్మక చిత్రాలని నిర్మిస్తూ వస్తోంది.  ఇక మిగతా భాషల సినిమాలు ఇప్పుడిప్పుడే సినిమా ని అందుకోవాలని ప్రయత్నిస్తున్నాయి.  కాని ఒక వెలుగు వెలిగిన తెలుగు సినిమా ...ఇప్పుడు ఆరిపోతోంది..   ఎవరైనా ఉన్నారా..? తెలుగు సినిమాకి ఓ కొత్త వెలుగును ఇవ్వగలిగిన వాళ్ళు ??

Wednesday 2 February, 2011

Canon 5D మార్క్ 2 - . సినిమాటోగ్రఫీ దుమారం


Canon EOS 5D Mark II with 50mm 1.4.jpg
 Canon 5D మార్క్ 2, సినిమా నిర్మాణ పరంగా  .. సినిమాటోగ్రఫీ పరంగా  ఒక పెద్ద సంచలనమే రేపుతోంది.
ఎన్నో కొత్త సినిమాలు పాత,  కొత్త .. దర్శకులు, సినిమాటోగ్రాఫర్ లు ఈ కెమేరా వైపు మొగ్గు చూపుతున్నారు.
మొన్నటికి మొన్న వర్మ గారు తన బ్లాగ్ లో, అతి తక్కువ మంది crew తో Zero budget లో   సినిమా తీసి విడుదల చేస్తాను అని చెప్పుకున్నాడు. ఇలా చెప్పగలిగే  దైర్యం  వొచ్చింది అంటే ఆది కేవలం ప్రస్తుతం అందుబాటులో ఉన్న డిజిటల్ కెమెరాల వల్లే,  ముఖ్యంగా  Canon 5D లాంటి కెమెరాల  వల్లనే అనుకొవొచ్చు. DSLR కెమేరా ఉపయోగించి  ఇప్పటికే దేశం మొత్తం మీద..
(ప్రపంచ వ్యాప్తంగా)  ఎన్నో సినిమాలు నిర్మాణం లో ఉన్నాయి.

కొన్ని దశాబ్దాల  క్రితం జార్జ్ ఈష్ట్ మాన్  కోడాక్   ఫొటోగ్రఫీలో " 35 mm  రోల్ ఫిలిం" కెమేరా  తయారు చేసి  "మీరు మీట నొక్కండి, మిగతా మేము చేసిస్తాం" అనే పిలుపుతో   ఫోటోగ్రఫి నీ సామాన్య జనాలకి అందుబాటులోకి తెచ్చాడు, అదో దృశ్య విప్లవం. అప్పటిదాకా ధనిక వర్గానికే పరిమితమై,  ఫోటో అంటే అపురూపం అనుకున్న జనాలు కెమేరా కొనుక్కొని తామే ఫోటోలు తీసి చూసుకున్నారు.ఆల్బంలలో బద్రంగా దాచుకున్నారు.
అలాగే VHS రాక  videography లో ఓ పెద్ద విప్లవం. VHS అన్ని తరగతుల జనావసరాలు తీరిస్తే ,  Hi8, మినీ DV ఫార్మటుల  రాకతో   కాం కార్డర్ కొనుక్కొని  ఎవరికీ వాళ్ళు వీడియోగ్రఫీ   చేయటం మొదలు పెట్టారు.

అయితే ఫిలిం మీద తీసిన ఫొటోగ్రాఫ్ ఎలా వొస్తుంది ?  అనేది అందరికీ అంతుబట్టక,. ఫోటోగ్రఫి మీద  ఏమాత్రం అవగాహన లేకుడా తీయటంవల్ల తద్వారా ఫిలిం కి ,  ప్రింట్ లకీ ఎంతో డబ్బువృధా అయ్యేది.  కాని  పదేళ్ళ క్రితం నుండి అందుబాటులోకి వచ్చిన డిజిటల్ టెక్నాలజీ ఫోటోగ్రఫి...వీడియోగ్రఫీ ..రూపు రేఖలే మార్చేసింది.  దీంతో తాము తీసిన ఫోటో ఎలా వొచ్చింది అన్నది ఎప్పటికప్పుడు చూసుకో వీలుకలిగి  వృధా ఖర్చు తగ్గింది. ఇంకోవైపు కంప్యూటర్ అందుబాటులో ఉండటం తో   ఎంతో అవసరం అయితే తప్ప,  తీసిన ప్రతీది ప్రింట్ వేయించు కోవటం మానేశారు.అంతే కాక photo editing చాలా సులభతరం అయ్యింది.  డిజిటల్ కెమేరాలతో అందరూ  ఫోటోలు , వీడియో క్లిప్స్ తీసుకొని , కంప్యూటర్ లో చూసుకొని  తృప్తి  పడ్డారు.

  డిజిటల్ SLR విషయంలో professioanals కొంత నిరుత్సాహ పడ్డిన మాట వాస్తవం.   కొన్ని విషయాలలో డిజిటల్ సెన్సార్ ఫిలిం కి సరితూగదనీ, ఫోటోగ్రఫి ఒక కళ గా కనుమరుగయ్యే అవకాశం ఉందనీ మొదట్లో  గగ్గోలు పడినా  work flow   సులువు మరియు వేగవంతం అయ్యి  ఖర్చు సగానికి సగం తగ్గి  పని వేగం పెరగటం తో డిజిటల్ కి ఆహ్వానించక తప్పలేదు. మార్కెట్టు కూడ స్పీడ్ కి అలవాటు పడి చిత్రం లోని చిన్న లోపాలను చూసి చూడక  సరిపెట్టుకుంది .

ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వొస్తే
Arriflex D-20/21 , Dalsa Origin ,F-23 (Sony CineAlta) ,F-35 (Sony CineAlta), Panavision Genesis Thomson Viper FilmStream , Vision Research Phantom65 , Vision Research PhantomHD , Arriflex Alexa లాంటి కెమెరాలు నిన్నటి వరకు డిజిటల్ సినిమాటోగ్రఫీ ని  నిర్దేశించాయి. 


 అలాంటి సమయం లో ప్రస్తుతం వస్తున్న high end  DSLR కెమెరాలు ఇటు ప్రొఫెషనల్ స్టిల్ ఫోటోగ్రఫి టో పాటు మంచి క్వాలిటీ గల వీడియో చిత్రీకరణ ని సాధ్యంచేయటం తో  సినిమాటోగ్రఫీ లో ఒక పెద్ద విప్లవమే వచ్చేసింది.
ముఖ్యంగా  Canon 5D మార్క్ 2 కెమేరా ఒక దుమారం రేపుతోంది. ఇవి పైన పేర్కొన్న డిజిటల్ సినిమాటోగ్రఫీ కేమేరాలకి సరితూగగల వీడియో చిత్రీకరణని అందిస్తుండటం తో ఒక్కసారి గా సినీమేధావుల , సినిమాటోగ్రాఫర్ల దృష్టి అటు మళ్ళింది.
ఫిలిం సినిమాటోగ్రఫీ కెమేరా కోటి  రూపాయలకి మించి ఉంటే.. RED మరియు ఇతర  కెమేరాలు   ముప్పై లక్షల పై మాటే.
DSLR విలువ 2 లక్షల్లోపే.. (ఇతర  పరికరాలు అదనం)
ఎంత వ్యత్యాసం ?
అయితే గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే   సినిమాటోగ్రఫీ మొత్తం కెమేరా మీద ఆధారపడి లేదు. కెమేరా కేవలం దృశ్యాని రికార్డ్ చేయగల సాధనం మాత్రమే. ఎంత అధునాతన కారు ఉన్నా.. నడపటం సరిగ్గా రాకపోతే ఏం లాభం ? అలాగే  ఎంత డిజిటల్ కెమేరా చేతిలో ఉన్నా దృశ్య రసాత్మకత ని అర్థం చేసుకోకుండా చిత్రీకరణ చేస్తే వ్యర్థమే. options ఎక్కువైతే ఎంపిక కష్టం. సాంకేతికత ఎక్కువైతే వొచ్చే చిక్కులు కూడ ఎక్కువే.
కాని ఈ DSLR సినిమా నిర్మాణ వ్యయాన్ని తగ్గించి,  నవ దర్శకులకు అందుబాటులో ఉండి, ప్రయోగాత్మక చిత్రాలకు తెర తీయనుంది  అనేది సుస్పష్టం.
ఈ సందర్భంగా  అర్థవంత  ప్రయోగాత్మక సినిమాలు రావాలని ఆహిద్దాం.

- చక్రధర్
chakrinet @జిమెయిల్.కం


Saturday 29 January, 2011

నాకు దెల్సిన తెల్గు సినిమా ..

 
ప్రపంచకం లో మన సుట్టూ .. జ్ఞానం ఉంది . ఏదో పంతుళ్ళు... ప్రకృతి కొంత వరకూ సర్ది చెపుతారు ఆతరవాత ఎవ్వడు  సేప్పడు .. ముఖ్యంగా డబ్బు సంపాదించే ఇషయం  ఎవడూ సేప్పడు. ఎవడికి వాడు  నేర్చుకోవలసిందే.
సిన్మా అంటే  రూపాయి రెండు రూపాయల ఇషయమా. పోతే పోయిందిలే ..వెదవది అని అనుకోటానికి..
లచ్చలు,కోట్లు యవ్వరమాయే.. ఏ తిక్కనా కొడుకన్నా ఆ కోట్లు అలా పారేసుకున్తాదేటి.. ఎంత ఎదవ పనులతో జంపాదించిన  డబ్బయితే మాత్రం..?  
కనిసం తిరపతి ఎంకన్న హుండీ లో వేస్తే .. వొచ్చే జన్మకి సరిపడా పుణ్యం ఇయ్యడా??
జనాలు ఎదవలు..  గా  ఎదవ సన్నాసులకి   ఏటి సేప్తాం ??
అసలు సెప్పటానికి ఎటున్నాదేటి ?
ఆళ్ళకి కావలసింది ఆల్లకిస్తాం.
మనకి కావలసింది ఆళ్ళు మనకిస్తారు.. అంతే యవ్వారం. 
ఆళ్ళకి ఎట్టాంటి  సినిమా గవాలో తెల్సా?? .. ఏదో రెండు గంటలు సినిమా జుడాల.. కొంచం సేపు నవ్వుకోవాల,  పిల్ల కి పొట్టి లంగా .. సగం జాకెట్టు వేసి.. గంతులు వేయిస్తే.కొంచం సేపు నరాలు జివ్వు మనాల.. హీరో అంటే ఆడు రా నిజంగా అనేటట్టు రెండు మూడు ఫైటింగులు ఉండాలా గంతే .

ఉల్లల్లకి బోయి సూసి రా ఓ సారి.. పొద్దుగాల్ల లేస్తే కూలి కోసం బుక్కెడు బువ్వకోసం పొద్దస్తమానం పని జేసి వొస్తారు.మొగుడు తాగుడుకి బోతే పెండ్లాము ఏం జెయ్యాల? ఆరనికో నెలకో  సినిమా చూపిస్తే కుషి అయితది. 

ఏందీ ??గాళ్ళకి మంచి జెప్పెలగా సినిమాలు  ఉండాన్నా ? సినమాలల్ల నీతులు సెప్పటానికి నేనేమనా.. సాములోరినా??

 ఏటి ఏటన్తున్నావ్.. కథ నేదా.. ??
సూడు.. సినిమా అన్నాక హీరో ఉండాలా. హీరోవిను ఉండాలా..
హీరో ఎనకాల హీరోయిన్.. హీరోయిన్ ఎనకాల హీరో పడాల.. మద్దెలో ఓ యిలన్ ఉండాలా..హీరో కి ఆడి కి కొట్లాట గావాల..  హీరో ఆడిని ఇరగ దన్నాల. హీరోయిన్  హీరో ఒళ్ళో ఆలి పోవాల..
రామాయణం తెలిదేంటి.. గిదే కదా..కథ.. అల్మీకి ముని సెప్పినాడు కదా ..సింపుల్  గా  గంత కంటే మంచి కథలున్నయా ?
సీతమ్మోరు  కనక నార చీరలు గట్టినాదాయే.. మన హీరోయిన్ ఎమన్నా సీతమ్మోరా  ? అందుకే గవి కూడ దేసేసి ,,సిన్న సిన్న గుడ్డలు గడతే సుసేటోళ్ళకి  గూడా  బావుంటాది . నాలుగు డబ్బులు రాలతాయి. ఇది యాపారం.తెనీదేంటి ?

ఏంటి  ఏదేదో అంటున్దావు.?? కళా నా .??
గిదంతా కళ గాదా... ఏంది ?
ఏంటి రసమా ??
రసము...సాంబారు... గవన్ని హోటల్లో గదా దొరుకుతాయి.. సినిమాల్లో గవి ఎందుకుంటాయి.
సమోసాలు ..చాయి .. గావాలంటే ఇంటర్వెల్  లో తింటారు గదా.. మరింకేంది?


ఏంటి  జనాలు  సెడి పోతున్నారా??నా సినిమాలు జూసి ??
ఏందయ్యా మాట్లాడుతునావ్?
నా సిన్మాల ఏముందని సేదిపోతున్నారు సెప్పు?? ఆళ్ళకి దేల్వాదా  గిది సిన్మా అని..
అయినా "పెద్దోల్ల" బాగోతాలు నీకు దేల్వాడా??  

హీరోలకంటే.. హీరోయిన్ ఉండాది సక్కగా అందంగా, ?  జనాల కె వరున్నారు ?? ఆళ్ళు మనుసులు గారా.. ఉప్పు కారం తినట లేరా?
పెండ్లాం ఏమో అంత సక్కగా లేకపాయే మరి కాపురం ఎట్లా జెయ్యాల ?? .. మా సిన్మా హీరోయిన్ ని కళ్ళళ్ళ వేట్టుకొనే గదా కాపురం జేస్తున్నాడు..
మరి ఆళ్ళ కాపురం నిలబెట్టేది మా సినిమాలే గదా?? 

ఏంటి   పిల్లా కాయలు   సెడి పోతున్నారా?? 
అవ్వ,, తెలుగు సిన్మాలు జూసి సెడి పోతున్నారా?? ఎవ్వరయ్య సెప్పింది..
ఇంగ్లీష్ ఫిలిం లూ జుసినవా ఎప్పుడన్నా..? గండ్ల జుపిచిందాని కన్నా ఎక్కుఉంటద  ఏంటి తెల్గు సినిమాలల్ల ??
వెనక ముందు జుసుకొని మాట్లాడయ్యా..
  
మీరు సెప్పె సినిమాలు ఎవరూ సుత్తారో తెలవదు, కాని ఆళ్ళు మాత్రం సూడరు . ఆళ్ళకి అర్థం గాదు.
నాకు దెల్సిన తెల్గు సినిమా ఇదే..

ఇంగా నా ఇషయం అంటావా ? ఏదో ఆల్లకంటే రెండు ముక్కలు ఎక్కువ దేలుసనుకుంటున్న .. నాలుగు రాళ్ళు ఏనాకేసుకోవలనుకున్నా..
ఏదో ఎట్టాగో కష్టపడి గీ తెలుగు సినిమాల కొచ్చినా.. ఓ రెండు సినిమాలు దీసుకొని నాలుగు రాళ్ళు సంపాదించు కోవల.. కొంచం ఎంజాయ్ జెయ్యాల.. గీ ఛాన్స్ వొచ్చే వరకే సగం జీవితం ఐపోయింది. ఇందాక సేప్పినట్టు ఓ సినిమా దీస్తే  హీరోయిన్ బాగానే సుపించింది గనక.. హీరో బానే తన్నాడు గనక..యిలన్ బానే తన్నులు తిన్నాడు గనక.. ఏదో రెండు మూడు డైలాగులు  పేలాయి గనక   ఈ సినిమా ఆడింది . కనక నాకో రెండు సినిమాలు వొస్తాయి..
నా  రేటు పెంచుకుంటాను.  నన్ను నమ్ముకున్నోల్లు ఉన్నారు గదా , ఆళ్ళని . పోషించు కోవద్దా   ?? 
పజలను ఉద్దరించటానికి నేనేవరయా ??
పభుత్వాన్ని అడుగు కళా పోషణ జెయ్యమని..ఆది పెబుత్వం బాద్యత.. మాది గాదు..
పెబుత్వం  తరపున సినిమాలు దియ్యాల.. అడగండి పెబుత్వాన్ని ..  ఎందుకుంది  పెబుత్వం   పీకనీకనా?

( ఇదీ " నేటి దర్శకుల" మాట..ఏం చేస్తాం .. :(  )


Thursday 27 January, 2011

తెలుగు సినిమా తన నిడివి తగ్గాలి


తెలుగు సినిమాకి కథ కరువై..  ప్రేరణ పేరుతో మక్కి కి మక్కి కాపి కొడుతున్న సందర్భం లో..
కథనం లో ఏవో ఏవో కొత్తదనం తీసుకుని రావాలన్న తాపత్రయం తో.. ఇష్టం వొచ్చినట్టు కథని ముక్కలుగా చూపించటం.
అనవసరంగా.. ఓ అయిదు పాటలు.. నాలుగు ఫైట్లు.. రెండు సెంటిమెంట్ సీన్లుగా విడగొట్టుకొని.. మూలకథకి   సరిపోయే  ఓ నాలుగు ఇతర బాష సినిమాలు ముందేసుకొని .. వాటిల్ల్లోంచి ముక్కలు ఏరుకోని  అతికించి సినిమా తయారు చేస్తున్నారు.
రెండున్నర గంటల వినోదం  పేరుతో.. సీస జండుబాం రాసుకొనే పరిస్తితి కల్పిస్తున్నారు.
అవసరాన్ని బట్టి రెండున్నర కాకపోతే మూడు గంటలైనా ఉండొచ్చేమో , మరీ పెద్దదయితే  రెండుబాగాలుగా తెసి sequel చేయొచ్చేమో గాని , అనవసరంగా ఉంటె మాత్రం తలనెప్పే.
 సినిమాని, చరిత్రని, దాని పోకడనీ, అవసరాన్ని చదివి,
సినిమా అంటే కళ అన్న మాట చాల దూరమైన విషయం. కకక ఆది వొదిలేస్తే..

కనీసం ఒక సాఘీక నిబద్దత ఉన్న మాధ్యమం అని అర్థం చేసుకొని సినిమాని తయారు చేయగల సమర్థులు కరువై.. వెలవెల లాడుతున్నది.  సినిమా అంటే ఒక వినోదం  వ్యాపారంగా మాత్రమె అన్నట్టు గా ఉన్నది మన తెలుగు సినిమా.
 త్రేతాయుగం లోనే సీతని రావణుడు ఎత్తుకు  పోయాడంటే, నిండు సభలో ద్రౌపతి  వస్త్రాపహరణం జరిగిందంటే..హింస..రాజకీయం.. వ్యభిచారం లాంటివి సమాజం లో ఎప్పుడూ ఉన్నాయి.. ఇప్పుడూ ఉన్నాయి. ప్రతుతం వాటిని ప్రతిబింబించే సినిమాలే తప్ప   జీవితపు అర్థం, ఆనందం ని తెలియజెప్పే సినిమాలు తక్కువయ్యాయి.
మూల కథ మంచి వస్తువే అయినా.. దాని రెండున్నర గంటలు సాగదీయాలి కనక అనవసర విషయాలి చొప్పించాల్సి వొస్తోంది.. తద్వారా అసలు కథకే ఎసరు వొస్తోంది. కథనాన్ని పరిగెత్తించలేక అనవసరం లేని పాత్రలు, పట్టాలు వేయాల్సి వొస్తోంది.

అపుదేపుడో సినిమాని మృష్టాన్న భోజనం తో పోల్చారు. అన్ని రసాలు ఉండాలని పండాలని.. ఇలా అన్ని రసాలు వండి వార్చే నలభీములు లేక.. సినిమా రుచి కోల్పోతున్నది.అదీకాక  ప్రస్తుతం జనాల నాలికలోని రుచి మొగ్గలు కొత్తగా వేశాయని తెలీక మృష్టాన్నం  పెడదాం అనుకుంటే ముష్టి ఘాతాలు తగులుతున్నాయి. ఆకలికి ఏ బర్గారో , పిజ్జాలో లాగించే పరుగుల ప్రపంచంలో  ఒకటో రెండో రసాలు చాలు. ఈ భోజన పథకం లో  అవసరమైన చోట ఫీల్ కావటానికి  ప్రేక్షకులకి కావలసిన టైం దొరకక.ఏ రుచిని ఆస్వాదించాలో తెలియక తికమకతో సినిమాని తిప్పి కొడుతున్నారు.
కనక ఈ నేపథ్యం లో... తెలుగు సినిమా తన నిడివిని తగ్గించు కోవలసిన అవసరం ఎంతయినా ఉంది.
సినిమా నిడివిని ఒకటిన్నర లేదా  రెండుగంటల లోకి తగ్గించుకుంటే  అనవసర కలల  పాటలు తగ్గి తెలుగు కథకి ఫారిన్ locations అవసరం ఉండదు. 
 సెక్స్ కామిడిలో సెంటిమెంట్ లేకుండా, పక్కా  aaction పక్కదారులు తొక్కకుండా, ప్రేమలో దోమలు లేకుడా.. పాట వోచినపుడు గుండె కాల్చుకోకుండా, fighting వోచ్చినపుడు  పామాట  ఆడకుండా ఉంటారు.
ఎలాగు మన హీరోలకి ఏ సీన్  ఇచ్చినా వాళ్ళకు  ఒచ్చిన ఒకే expression  పెడతారు కనక వాళ్ళకు ఆ నటనా  పరీక్ష తప్పుతుంది.. చూసేవాళ్ళకి  అగ్ని పరీక్షా ఉండదు.
అప్పటిదాకా కొంగు కప్పుకున్న హీరోయిన్ అమాన్తనగా..పోట్టిలంగా తో గెంతటమూ  ఉండదు. అలా పొట్టి లంగాతో కనిపించాలనుకుంటే  దానికోసం ఇంకో సినిమా చేస్తుంది కాని ఒకే సినిమాలో ఇలా doble  action ఉండదు.
అపుడు సెన్సార్ వాళ్ళకి కూడా భక్తి సినిమాకి A సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం రాదు.
అదీ కాక.. ఒకటో రెండో రసాలని వండి వడ్డిస్తున్నారు కనక. ఫామిలి మొత్తం ఒకే సినిమాకి రాకపోయినా. ఎలాగూ multiplex లు ఉన్నాయి  గనక పక్క పక్క theater లలోనైయినా  తమతమ సినిమాలని చూసెల్లి పోతారు.అ వొచ్చే నాలుగు రాళ్ళు నలుగురు పంచుకుంటారు, తెలుగు సినిమా నాలుగు కాలాలపాటు ఉండటానికి అవకాశం ఉంటుంది. ఓ నలుగురు నవ దర్శకులకి అవకాశమూ దొరుకుతుంది.
(ఈ పని పక్క  వాడు చేయకముందే  జాగ్రత్త పడటం బెటర్. లేదా దీనికోసం కూడా ఇంకోసారి పొగడాల్సి ఉంటుంది). - చక్రధర్

Monday 24 January, 2011

Never let me go .


  Kazuo Ishiguro రాసిన  "Never let me go " నవల ఆధారంగా అదే  పేరుతో  రూపొందించిన   సినిమా ఇది.
ఎన్నో అంతర్జాతీయ  సినిమా పండుగలలో ప్రదర్శించబడి , కొన్నింట  అవార్డులు గెలుచుకున్న ఈ సినిమాకథ కొంచం లోతయినదే అయినా ..  తెలుగు సినిమాలకి అలవాటు పడిన మైండ్ ని కొంచం సేపు పక్కన పెట్టి, చూడటం మొదలు పెడితే   అలా చూస్తుండి పోతాం.
 ఆ నటన .. ఆ దృశ్యాలు.. ఆ నేపథ్య సంగీతం .. మనల్ని  కట్టి పడేస్తాయి.
ముగ్గురు స్నేహితుల  కథ ఇది .

నా పేరు Kathy..వయసు.. 28 . గత 9సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నాను...అంటూ Kathy తన కథని మొదలు పెడుతుంది.
చిన్నతనం
ప్రపంచం తో బొత్తిగా సంభందం లేని Hailsham అనే బోర్డింగ్ స్కూల్,   బోర్డింగ్ స్కూళ్ళలో  ఉండే  నియమ, నిభందనలు..   స్కూల్ వాతావరణంతో పాటు  Kathy,  Ruth అనే ఇద్దరు స్నేహితురాళ్ళుని  పరిచయం చేస్తారు మనకి. . బెరుకు మనస్తత్వం గల  Tommy అన్నింటా కొంచం వెనకబడి ఉంటాడు, మిగతా పిల్లలు అతని గేలి చేస్తుంటారు. దీంతో  Kathy కి అతని మీద జాలి కలుగుతుంది. అలా Kathy , Tommy   ల మధ్య స్నేహం చిగురించి  ఇష్టానికి దారి తీస్తుంది. Ruth కి  ఈ  విషయం తెలిసి .. తానుకూడా  Tommy నే ఇష్ట పడటం మొదలుపెడుతుంది . Tommy  అభ్యంతర పెట్టడు. ఇది  గమనించిన Kathy  నిస్సహాయంగా బాధ పడుతుంది.
 ఆ స్కూల్ గురించి  ..పెద్దయ్యాక  తామేం చేయబోతారో అన్న విషయం గురించి  తెలుస్తుంది వాళ్ళకి.

యవ్వనం 
 యవ్వనం లోకి అడుగు పెట్టిన వీళ్ళని  "cottages " అన బడే   ఫార్మ్ హౌస్ లోకి  పంపిస్తారు. అక్కడ వేరే ఇతర స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళు కూడ ఉంటారు. " cottages " లో కొంచం వ్యక్తి గత స్వేఛ్చ  ఇవ్వబడుతుంది.  ఒకింత ప్రపంచాన్ని చూడగల అవకాశమూ  ఉంటుంది .
 Tommy , Ruth ఇంకా దగ్గరవుతారు. Kathy అంతా చూస్తున్నా,  బాధని భరిస్తుంది కాని  స్నేహాన్ని వీడదు.
తనకో విషయం తెలిసిందనీ, ఆవిషయం కనుక్కోటానికి తమ తో పాటు Kathy నీ రమ్మంటుంది Ruth .  ఇంకో జంట తో పాటు  Tommy ,  Ruth , Kathy   దగ్గరలోని టౌన్ కి  వెళతారు.
ఇద్దరు వ్యక్తులు నిజమైన ప్రేమ లో ఉంటే ...ఆది రుజువు చేయగలిగితే "మరి కొంత కాలం"  వాళ్ళు   కలిసి ఉండటానికి అనుమతి దొరుకుతుందనీ,ఇంతకు ముందు మీ స్కూల్  వాళ్ళకి లభించిందనీ  విన్నాం...ఆది నిజమేనా ??   అని  స్నేహితులు అడుగుతారు.కాని వీళ్ళకీ ఆ సంగతి   తెలియదు. కాని Tommy మాత్రం దాని గురించే  అలోచించి  తను వేసిన drawings  తన ప్రేమకి రుజువులుగా పనికొస్తాయేమో అని అంటాడు Kathy తో.
కాని ఆ "ప్రేమ" ఎవరి మీద ?
కాలం గడుస్తుంది... ఎవరికి  వారు  విడిపోతారు. 
మరణం 
పది  సంవత్సరాలు గడుస్తాయి.. Kathy ఆసుపత్రి లో carer పనిచేస్తుంటుంది. అనుకోకుండా Ruth  కలుస్తుంది.  తనని మళ్లీ కలుస్తానని  అనుకొలేదనీ,  మూడో operation తరవాత తను బ్రతకటం కష్టమే అని Ruth అంటుంది . దగ్గరలోనే Tommy కూడ ఉన్నాడని, ముగ్గురం కలసి విహారానికి  కి వెల్లాలి  అన్న  కోరిక  తెలియ చేస్తుంది .

"తీరం లో వదిలేయబడిన పడవ" దగ్గరికి వొస్తారు ముగ్గురూ. తానెప్పుడు Tommy ని  ప్రేమించలేదనీ , Tommy , Kathy "నిజమైన ప్రేమ" సాగకుండా తనే  అడ్డుకున్నాననీ,   జెలసి వల్లా ..తాను ఒంటరి దాన్ని అయిపోతానేమో అన్న భయం వల్లా అలా చేసానని, తనని క్షమించమనీ  పశ్చాతాప పడుతుంది Ruth . వాళ్ళిద్దరూ ప్రేమికులుగా రుజువు చేసుకొని కొంత కాలం ఆనందంగా ఉండమని "అనుమతి" ఎక్కడ లభిస్తుందో అడ్రెస్స్ ఇస్తుంది.
"అనుమతి" తీసుకోవటానికి తాము నిర్ణయించుకున్నామని Ruth కి చెపుతుంది Kathy.  తరవాత operation జరిగి Ruth  మరణిస్తుంది.
నిజమైన ప్రేమికులైన Tommy , Kathy  లు   అనుమతి కోసం వెళ్తారు. కాని అలాంటిదేమీ లేదని అదంతా ఒక అపోహ అని తెలుస్తుంది.
 ఈ విషయం లో పెద్దగా నమ్మకాన్ని పెట్టుకోని Kathy  అంతగా బాధ పడదు. కాని ఆశ పడిన Tommy మాత్రం  వ్యధ చెందుతాడు.
తరవాత  Tommy కూడ  మరణిస్తాడు.
Kathy కీ  తెలుసు, తానూ మరణిచ బోతున్నానని .
మనసు బాధగా ఉన్నపుడు   సందర్శించే ఒకానొక ప్రదేశం లో..  భూమధ్య రేఖ ని చూస్తూ చెప్పే మాటలతో.. .. Kathy కథని ముగిస్తుంది.

అసలు Hailsham స్కూల్ ఏమిటి ? Ruth , Tommy లు ఎందుకు మరణించారు ?  Kathy కూడ ఎందుకు మరణించ బోతోంది ?
ఇవన్నీ తెలియాలంటే  సినిమా చూడాల్సిందే.


 Director: Mark Romanek

Writers: Kazuo Ishiguro (novel), Alex Garland (screenplay)

Stars:, Carey Mulligan , Keira Knightley and Andrew Garfield .

 

చక్రధర్ 

chakrinet @gmail .com

Wednesday 19 January, 2011

"మెగా స్టార్" సినిమాటోగ్రాఫర్.



సినిమా ఒక దృశ్య మాలిక అయనప్పటికీ.. కథా ప్రధానం కనక..  ప్రేక్షకుడు కథలో లీనం అయిపోతాడు.  మన తెలుగు సినిమా ముఖ్యంగా  మాటల్లో కథ నడుస్తుంటుంది,  కనక చెవులు రిక్కించి వింటుంటాడు. అందుకే కళ్ళ ముందు వొచ్చే అద్భుతమైన చిత్రీకరణని పెద్దగా గుర్తించక పోయినా.. ఆ దృశ్యాలు  సూటిగా అంతః చేతనం లోకి వెళ్ళిపోతాయి.  ఆ ప్రకారం లో సినిమాలోని దృశ్యాలు అంతర్లీనగా పని చేస్తాయి.తదనుగుణంగా హృదయాంతరాళం లో ఎక్కడో ఒక విధమైన  రాసానందం ఉంటూనే ఉంటుంది.
నిన్న ఎందుకో అభిలాష చిత్రం లో ఒక పాట చూస్తున్నపుడు చిత్రీకరణ చాలా సాధారణంగా కనిపించినప్పటికీ కనపడుతున్న దృశ్యం లో ఎక్కడో ఒక అందం దాగి ఉంది అని అనిపించింది. ఓ పాటలో  రాధిక,  చిరంజీవి  కురులలో సూర్య కాంతి అందంగా మెరుస్తుండగా అంటే అందంగా ఇద్దరి మోహము నవ్వుతు  పాటలోని లయ కనుగుణంగా అడుగులు పడుతున్నాయి. ఇళయ రాజా సంగీతం అన్నింటి మీద పై చేయి సాధించినప్పటికీ నా కళ్ళకి ఆ చిత్రీకరణ ఆకట్టుకుంది.  అప్పుడు మళ్లీ  వెనక్కి   వెళ్లి టైటిల్స్ చూసాను..లోక్ సింగ్ గారు సినిమాటోగ్రాఫర్. అప్పుడు గుర్తొచ్చింది  అయన గురించి.  ఇంకొంచం  వెతికితే మరిన్ని  విషయాలు తెలిసాయి.
  హంగు, ఆర్భాటము కనపడకుండా... కథ కి అనుగుణంగా.. ఎక్కడా కథమీద పైచేయి కాకుండా  .. కావలసిన మూడ్ ని అందిస్తూ.. అందంగా, పగలూ ..రాత్రి...ఉదయం.. సాయంత్రం...వర్షం..చలి ఇలా ఇలా కథానుగుణ   వాతావరణం పట్టు జారకుండా   చిత్రీకరణ చేయటం మంచి సినిమాటోగ్రఫీ అనుకుంటే.. అలా ఎన్నో సినిమాలకి మంచి సినిమాటోగ్రఫీ అందించినవారు లోక్ సింగ్ గారు.



చిరంజీవి "ప్రతి నాయకుడుగా" వచ్చిన ఇది కథ కాదు తో మొదలు పెట్టి  న్యాయం కావలి, శుభలేఖ , అభిలాష,  కైదీ , హీరో,  గుండా, చాలెంజ్, విజేత, రాక్షసుడు, స్వయం కృషి ,పసివాడి ప్రాణం , దొంగ మొగుడు , రుద్రవీణ, కైదీ నెంబర్ 786 , కొండవీటి దొంగ ..లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో  పాటుగా  చిరు మెగా స్టార్ గా ఎదిగిన  గ్యాంగ్ లీడర్ వరకూ చిరంజీవి గారి మెగా ప్రస్థానం లో   దాదాపు 31 సినిమాలకి ఆయనే ఛాయాగ్రాహకుడు. ఒకే వ్యక్తి  సినిమాటోగ్రాఫర్ గా  ఇన్ని సినిమాలు మరెవరితోనూ చేయలేదు చిరంజీవి గారు. చిరంజీవి  గారిని అత్యంత handsome గా... ఠీవి..దర్జా.. దర్పం..బాగా elevate అయ్యేట్టు చిత్రీకరించింది లోక్సింగ్ గారే .

   సన్నివేశం చిత్రీకరించే  పరిసరాలలో ఉన్నఅందుబాటులో ఉన్న  కాంతి అందిపుచ్చుకొని, దానిని అందంగా వాడుకోవ టము,  కృత్రిమ లైట్స్ ని వాడినప్పటికీ ఆది వాడి నట్టు తెలియకుండా, అందుబాటులో ఉన్న  కాంతి తో చిత్రీకరించి నట్టు  సహజత్వం తీసుకొని రావటము ఆయన ప్రత్యేకత.
 కే. విశ్వనాధ్ గారితో శుభలేఖ..స్వయం కృషి..  స్వర్ణ కమలం  చిత్రాలకి చాయగ్రహణం చేసారు. అన్ని చిత్రాల్లో సహజత్వం ఉట్టిపడుతుంది. నాకు బాగా నచ్చిన చిత్రం స్వర్ణ కమలం


. ఓ పక్క  ప్రకృతి సౌందర్యం, దాంతో  పోటి పడుతున్న భాను ప్రియ గారి అందం..రెండింటినీ  కనువిందు చేయిస్తూ, ఆ నాట్య విన్యాసం మకుటాయమానం అయ్యేట్టు కెమెరా కోణాలను ఎన్నుకొని .. ఆ పాద లయలకి అనుగుణ మైన కెమెరా కదలికలు పట్టు సడలకుండ చిత్రీకరణ జరపటం అయన నైపుణ్యానికి ఓ ప్రతీక. 
 ఆయన ఛాయాగ్రహణాన్ని మరోసారి కొనియాడుతూ ..
చక్రధర్

Sunday 9 January, 2011

సినిమా - sensibility ( అర్థవంత భావోద్వేగం )


"Transformation of Impression into Expression is art " .
మనచుట్టూ జరుతుగున్న వాస్తవ పరిస్తితులు మనలో ఎలాంటి స్పందన కలిగిస్తున్నాయి. మనం వాటిని ఏ విధంగా స్వీకరిస్తున్నాం తిరిగి ఎలా వ్యక్త పరుస్తున్నాం ?
స్వతహాగా ఫీల్ అయింది మొత్తానికి మొత్తంగా వ్యక్త పరచలేము.ఈ వ్యక్త పరచటం లో ఒక ఫిల్టర్ ఉంటుంది
 - వ్యక్తం-  అనేది మనం పుట్టిపెరిగిన పరిస్తితులు,  మన స్వభావం, చదువు, శిక్షణ , సంస్కారం , అలవాట్లు, , విచక్షణా జ్ఞానం, జనామోద యోగ్యతని ( acceptability )  ఎంచుకోడం  వీటన్నింటి ద్వారా ఫిల్టర్  అయ్యి వ్యక్తం అవుతుంది.  ఇలా  ఒక ఘటన...పరిస్థితికి  emotional and logical గా ఆలోచన చేసి సమయ  సందర్భానుసారంగా అర్థవంతంగా వ్యక్తం చేస్తాం. అలా  వ్యక్తం చేసిన భావోద్వేగాన్నే  "సెన్సిబిలిటీ" అనొచ్చు.
 సినిమాలోని పాత్రలకి సెన్సిబిలిటీ ఉంటుంది. సినిమా చూసే ప్రేక్షకుడికీ సెన్సిబిలిటీ  ఉంటుంది.
 సినిమాల్లోని  పాత్రలు  కథలో జరిగే సంఘటనలకి స్పందించే విధానం సరిగ్గా ఉండి  ప్రేక్షకున్ని కూడా అదే విధమైన భావోద్వేగాలకి లోను చేస్తూ కథా గమనానికి ఉపయోగపడితే  సన్నివేశం బాగా పండుతుంది. ఇదే సెన్సిబిలిటీ. సినిమాల్లో సెన్సిబిలిటీ లోపిస్తే చూడటం కష్టంగా ఉంటుంది. ఆ పాత్రల   ఓచిత్యాలు దెబ్బతిని  వెకిలి గా అనిపిస్తూంది.
రచయిత సెన్సిబిలిటీ ని బట్టి అతను సృష్టించిన పాత్రలు ఉంటాయి. అ కథని తీయబోయే దర్శకుని సెన్సిబిలిటీ ని బట్టి "సినిమా సెన్సిబిలిటీ" ఉంటుంది. 

                       “where drama begins logic ends”. - Alfred Hitchcock’
అబద్దం ఆడితే అతికినట్టు ఉండాలి అన్నట్టు ,  ఎంత నాటకీయత అయినా ఆది sensibility ని అంటి పెట్టుకొని ఉండాలి.  కథ ఎలాంటిదైనా  కావొచ్చు.. horror , fantasy ..science fiction , social satire ..,కాని అందులోఉండే భావోద్వేగాలు మాత్రం ఒకటే.  అ భావోద్వేగాలలో నిజాయితీ  ఉండాలి .ఆది   లోపించినపుడు  సినిమా  దెబ్బతింటుంది.
ఉదాహరణకి ఒక horrer ఫిలింలో ఓ సన్నివేశం  చూస్తున్నాం, పాత్రలకి భయం కలుగుతోంది. ఆది ప్రేకకులు కూడ ఫీల్ కావాలని రచయిత ఆ సన్నివేశం రాసుకున్నాడు, కాని   సన్నివేశం భయం కలిగించటం లేదు,  చప్పగా ఉంది.
సన్నివేశం లో పాత్రలు  భయ పడుతున్నాయి..కాని ప్రేక్షకునికి హాస్యం రావాలి  అని రచయిత  రాసుకుంటే. ..హాస్యం రాలేదు కాని  వెకిలి గా  అనిపించింది.

 సన్నివేశం ఎలాంటి భావోద్వేగం కోసం రాయబడిందో  అలాంటి భావేద్వేగం వొచ్చినట్టయితే, అంటే సన్నివేశం లోని సంఘటనకి పాత్రల స్పందన చూసి ప్రేక్షకుడు కూడ స్పందించి, తక్కువలో తక్కువ convince కావటమో జరిగితే అప్పుడు సన్నివేశం sensibile   గా ఉంది అని అనుకొవొచ్చు.

 సెన్సిబిలిటీ ఎలా వొస్తుంది ?
 రచయిత 
  ఉహాత్మకంగా.. కాల్పనికంగా కొన్ని పాత్రలు వాటి  స్వభావాలు, సంఘటనలు సృష్టిస్తాడు రచయిత. అవన్నీ కలిపి   సినిమా  మొత్తానికి ఉన్న సెన్సు నీ,  ఎస్సెన్సు నీ దెబ్బ తీసేలా ఉండకూడదు. అవి నేల .. గాలి.. గ్రహం... విశ్వం విడిచి సాము చేయకూడదు. సినిమాల్లోని ప్రధాన పాత్రలు ఒక స్వభావాన్ని అంటిపెట్టుకుని ఉండాలి. ఆది ఎంత సహజంగా  ఉంటె అంత మంది ఆమోదం  పొందుతుంది.పాత్ర స్వభావాని బట్టి సంఘటనలు సృష్టించాలి. ఏ సంఘటన అయినా సృష్టించొచ్చు.
మొదట్లో సంఘటనలు పాత్ర స్వభావాన్ని తెలియచేసేందుకు సృష్టించబడి .. తరవాతవి కథా  గమనానికి ఉపయోగపడాలి.అలా కాకుండా పాత్ర స్వభావాన్ని దిగజార్చే విధంగా ఉండకూడదు. ప్రధాన పాత్రల మీద ప్రేమ, గౌరవం, జాలి  లాంటి  పాజిటివ్ భావోద్వేగాలు  కలిగేలా ఉండాలి  తప్ప..ద్వేషం చికాకు కలిపించబడే విధంగా ఉండొద్దు, ఒకవేళ మొదట్లో ఉన్నా తరవాత మెల్లిగా పాజిటివ్ గా మారాలి.
కథలో/ సన్నివేశాల్లో  పాత్రలు స్పందించే తీరుకు ఒక పరిధి ఉంటుంది, ఆ  పరిధి  దాటి ప్రవర్తిస్తే సెన్సిబిలిటీ లోపిస్తుంది.
మన సినిమాల్లో   హీరోఇసం  పేరుమీద ఈ సెన్సిబిలిటీ నీ తుంగలో తొక్కేసి విచిత్రమైన సన్నివేశాలు  రాస్తున్నారు.  హీరోలు  ఈ సెన్సిబిలిటీ ని ఏమాత్రం ఆలోచించక  "కనీస పరిజ్ఞానం" లేకుండా అలాంటి  సన్నివేశాల్లో  నటించేసరికి  అభిమానులకి / ప్రేక్షకునికి నవ్వాలో ఏడవాలో అర్థం కావటం లేదు.

సెన్సిబిలిటీ లోపం -  ఒక ఉదాహరణ
 పవన్ కళ్యాన్  నటించిన పులి సినిమా లో హీరోయిన్ పాత్ర  గురించి మాట్లాడుకుందాం,
ఆ పాత్ర సృష్టి , సన్నివేశాలు సినిమాని బాగా దెబ్బ తీసాయి అనటం లో ఏ మాత్రం సందేహం లేదు. పవన్ పాత్ర బాగా సీరియస్ గా ,  ఎంతో దేశభక్తి గల్గిన పాత్రగా రాయటం లో కొంత  సఫలమైన రచయిత హీరోయిన్ విషయం లో కేవలం హీరోని ఆకట్టు కోవాలని..ప్రేమని పొందాలని తపన పడే పాత్ర గా రాసుకున్నాడు.  కాని  ఆ ఇష్టంలో, ప్రేమలో  సహజత్వం , నిజాయితీ లోపించి  వెకిలిగా ఒక  "వ్యక్తిత్వం"  లేని పాత్రగా అయ్యింది . హీరో, హీరోయిన్ ల మధ్య జరిగే  సన్నివేశాల్లో " సీరియస్ పాత్ర" అయిన హీరో హీరోయిన్ వెకిలి చేష్టలకి  ఎలా స్పందిచాలో తెలియక తిక మక పడతాడు. బహుశ  ఈ సన్నివేశాల  ద్వారా హాస్యం వొస్తుందేమో అనుకొని రాసినట్టు ఉన్నాడు, కాని రాలేదు.  ఒక పెద్ద పోలీసు ఆఫీసర్,  అలా అమ్మాయి వెకిలి చేష్టలకి పడిపోయి..ముద్దు పెట్టటం,,తాళి కట్టటం జరిగిపోతాయి.  ఈ  సన్నివేశాలన్నీ చాల ఎబ్బెట్టుగా ఉంటాయి. దీనినే  సెన్సిబిలిటీ లోపించటం అని చెప్పొచ్చు. ఉదాత్తంగా ప్రవర్తించే హీరో పాత్ర అప్పటికప్పుడు వెకిలిగా ప్రవర్తించలేక.. ఎంత హాస్యం పండించాలనుకున్నా, ఎంత సినిమా నాటకీయత అనుకున్నా.. ఇది వర్కౌట్ కాలేదు, కాదు. అంత పెద్ద హీరో పాత్ర ఇలా వెకిలి తనం  ప్రదర్శించటం వల్ల sensibility దెబ్బ తిన్నది.
చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు ..ఎన్నో సన్నివేశాలు.
సెన్సిబిలిటీ ఉండటం   -   ఒక ఉదాహరణ 
పాత్రలు మలిచిన తీరు,   సన్నివేశాలకి అనుగుణంగా ప్రవర్తించిన తీరు సరిగ్గా ఉండి తద్వారా  సినిమా sensible   గా ఉంది అని చెప్పుకోటానికి  ఘర్షణ ( కొత్తది ) ఒక ఉదాహరణగా తీసుకోవొచ్చు.  అందులోనూ   ఒక పోలీసు ఆఫీసర్ (వెంకటేష్) కి  ఆసిన్
తారస పడుతుంది. ఏదో బలమైన ఆకర్షణ మొదలవుతుంది . అలా పదే పదే తారస పడి..  ఇద్దరి మధ్య ఒక రసాయన భంధం
( కెమిస్ట్రీ ) ఏర్పడుతుంది.
హీరో అలాంటి  అమ్మాయికి ఆకర్షింపబటటం లో మనకి ఎలాంటి సందేహాలూ రావు.పాత్ర పరంగా, సన్నివేశ పరంగా, చిత్రీకరణ పరంగా, ప్రేక్షకుని పరంగా  చూడటానికి చాల pleasant గా అనిపిస్తూ.. ప్రేక్షకునిని convince చేస్తుంది.
 నిజాయితి గల పోలీసు ఆఫీసర్ పాత్ర ,సహజంగా, సరళంగా  గా ఉండే అమ్మాయి ఆకర్షణ కి లోనుకావటం లో .. ఒక సెన్సిబిలిటీ కనిపిస్తుంది.
దర్శకుడు 
తనే స్వయంగా రచన చేయటమో లేదా తన ఐడియా కి  రచయితని ఎంచుకోవటమో, లేదా  రచయిత రాసిన కథని తను  ఎంచుకోవటమో చేసేది దర్శకుడు. అయితే రచయిత అనుకున్న విధంగా కాక ..వేరేవిధంగా visualization  చేయటం, చిత్రీకరించటం వల్ల ఈ సెన్సిబిలిటీ దెబ్బ తినే ఆస్కారం ఉంది. కనక , రచయిత ఆ సన్నివేశం లో ముఖ్యంగా ఏం చెప్పదలచుకున్నాడో   అ భావోద్వేగం పస్పుటం అయ్యేలా చిత్రీకరించాల్సి ఉంటుంది.సన్నివేశం లో రాసిన భావాన్ని ప్రేక్షకులు అనుభూతి చెందేలా  చిత్రీకరించగలగాలి. ఇదే దర్శకుని పనితనం.
 ప్రేక్షకుని  పరంగా
ప్రేక్సకుడి సెన్సిబిలిటీకి ,  సన్నివేశలో సెన్సిబిలిటీకి  లో సమన్వయం కుదిరినపుడు ప్రేక్షకుడు భావోద్వేగం పొందుతాడు

ప్రతి మనిషి   లోపల ఇంకో మనిషి ఉంటాడన్న విషయం మనకి తెలిసిందే.బయటికి కనపడే మనిషి , లోపలి మనిషి. ఈ ఇద్దరి స్వభావాల్లో మార్పు ఉంటుంది. బయటికి హాస్య చతురుడు గా ఉన్న వ్యక్తి లోపల గంభీరం ఉండవచ్చు. బయటికి సామాన్యుడిలా కనిపించే వ్యక్తి గొప్ప త్యాగ శీలుడై ఉండవచ్చు.  బయటికి  పిరికి వాడుగా కనిపించే వ్యక్తి లోపల గొప్ప  దైర్యశాలి అయి ఉండవొచ్చు.
 ఈ ' బయటి లేదా లోపలి వ్వ్యక్తి' ని  సంతృప్తి పరిచే విధంగా పాత్రలు , కథలు తయారు చేసినట్టయితే  ప్రేక్షకుడు సినిమా లో మమేకం అయిపోతాడు . నిజ జీవితం లో చాల మంది ఇలా ఉండాలి/ అలా ఉండాలి అనుకుంటారు , కాని ఉండలేరు. కాని తాను చూసే సినిమాలోని ప్రధాన పాత్ర తాము ఎలా ఉండాలి అనుకుంటారో  అలా ఉన్నపుడు, లేదా అదే విధంగా ప్రవర్తిస్తున్నపుడు...ప్రతిస్పందిస్తున్నపుడు  తమని తాము ఆ ప్రధాన పాత్రలోకి దూరిపోయి  ఆ పాత్ర తో పాటు తామూ  అలాగే ఫీల్ అవుతూ.. సినిమా ని బాగా అనుభూతి చెందుతారు

చివరి  మాట 
విద్యార్థి పరిక్ష పేపర్ దిద్దుతున్నపుడు, ఎంత తప్పుగా రాసినా , ఎన్ని తప్పులు రాసినా వదిలేసి ,  ఏ మాత్రం  సరిగ్గా రాసినా మార్కులు ఇవ్వాటానికి రెడీ గా ఉన్న ఉపాధ్యాయుడిలా  .. ప్రేక్షకుడు కూడ  సినిమాని అర్థం చేసుకొని ..కొన్ని సార్లు సెన్సిబిలిటీ లోపించినా.. పట్టించుకోక.. అందులో ఏమూలయినా ఒకింత   సరయిన బావోద్వేగం ఉన్నా ఫీల్ అయ్యి మార్కులు ఇవ్వటానికి రెడీ గా ఉంటాడు.
 అయినప్పటికీ మార్కులు రావటం లేదంటే  .. మరి లోపం ఎక్కడుందో  రాసేవాళ్ళకే/ తీసేవాళ్ళకే   తెలియాలి.

చక్రధర్
chakinet@gmail.com




..