Monday 27 December, 2010

రససిద్ధి

  
 యతో హస్తస్తథో దృష్టి:
యతో దృష్టిస్తథో మనః
యతో మనస్తథో భావః
యతో భావోస్తథో రసః  
ఎక్కడికైతే చేతులు వెళతాయో..అక్కడ దృష్టి  ఉండాలి, ఎక్కడ దృష్తి ఉంటుందో అక్కడ మనస్సు నిలపాలి, ఎక్కడ మనస్సు నిలుపుతామో  అక్కడ భావన ఉంటుంది..ఎక్కడ భావన ఉంటుందో అక్కడ రసం ఉంటుంది. - అభినయ దర్పణం 
            దృష్టి,  మనస్సు, భావము చేసే కళల మీదే లగ్నం చేయాలి అప్పుడే రససిద్ధి కలుగుతుంది. 

         జంధ్యాల గారి మాటలు, వేటూరి గారి పాటలు,  ఇళయ రాజా గారి సంగీతము, తోట తరణి గారి కళ, బాలు, జానకి శైలజ గార్ల మధుర గానం, పాత్రలు, పాత్రధారులు, అభినయం, ఆహార్యం..ఒకటేమిటి  అన్ని  సినిమాకి సంపూర్ణత్వాన్ని తెచ్చిపెట్టాయి.చాల సరళంగా కనిపించినా  ఒక్కొక్క సీను కల్గించే భావోద్వేగంలో  పడి కొట్టుకు పోవాల్సిందే ఎవ్వరైనా. దానికి తోడు  ఇళయ రాజా background మ్యూజిక్, గుండె ని  పట్టి పిండేస్తుంది.
అందుకే  1984 లో  రెండో  జాతీయ ఉత్తమ చిత్రంగా రజిత కమలం సొంతం చేసుకుంది. ఇళయరాజా కి ఉత్తమ సంగీతానికి, బాలు గారికి ఉత్తమ గాయకుడిగా కూడా అవార్డులు వరించాయి.
ఆర్ద్రత నిండిన కథతో, సునిశితమైన హాస్యం కలగలపబడి , multiple flashback లతో నడిచే ఈ సినిమా screenplay గొప్పగా  ఉంటుంది.

* ఒక బీద నాట్య కారుడు ఏదో గొప్ప సాధించాలనుకొని..  ఆ ప్రయాణం లో ప్రాణం అయిన తల్లిని కోల్పోయి, ప్రేమని త్యాగం చెసి ఒంటరి వాడై,  తాగుబోతుగా మారి.. చివరికి  క్షణాల్లో తన కళని బ్రతికిన్చుకోవాలని పడే  తాపత్రయమే  ఈ సినిమా.
*  ముగ్గురు స్నేహితులు, నాట్యమే బ్రతుకైన ఒక స్నేహితుడు, విధివశాత్తు తాగుబోతుగా మారి ఆరోగ్యం దెబ్బతిని చావు బ్రతుకుల మధ్య ఉంటే అతన్ని  బ్రతికిన్చుకోవాలని మిగతా ఇద్దరు  చేసే ప్రయత్నం.
*నాట్య కారిణి గా బహు ప్రశంశలు అందుకొంటున్న ఒక అమ్మాయి, తన తల్లి ఒక తాగుబోతు దగ్గర మళ్లీ నాట్యం నేర్చుకోమని అంటే.. తల్లికి, అతనికి  మధ్య  సంబంధం ఏదోలా ఉహించుకొని.... చివరకు  వాళ్ళిద్దరి మధ్య  ఉన్న "ఉన్నతోన్నతమైన" సంబంధాన్ని  తెలుసుకొని..పశ్చాతాపంతో   .. ఆ కళాకారునికి చేసే కన్నీటి వందనం .
ఎలా చెప్పినా ... ఈ కథలన్నీ ఒకే  సినిమా.
ఇది  ఒక multiple layered movie . 

బాలు గా పిలవబడే బాలకృష్ణ కి  నాట్యం అంటే ప్రాణం. గొప్ప నాట్య కారుడు కావాలని తపన.  అన్ని రకాల శాస్త్రీయ నృత్యాలు నేర్చుకొని భారతీయ నృత్యం అనే కొత్త సంప్రదాయాన్ని కనిపెట్టాలన్నఆశయం. కాని అందుకు తగ్గ ఆర్ధిక స్తోమత ఉండదు. కాని ఎలాగో తంటాలు పడి  నేర్చుకుంటూ ఉంటాడు. తల్లి వంటలు చేస్తూ బాలుకి అప్పుడప్పుడు డబ్బు పంపుతూ ఉంటుంది.ఆమెకి కూడా   తన కొడుకు  నాట్యం చేస్తూ పదిమందిలో ప్రశంసలు పొందాలని కోరిక.
బాలు కి  ఒక ప్రాణం అమ్మ అయితే ఇంకో ప్రాణం స్నేహితుడు రఘు.
ఇలాంటి సమయంలో.. మాధవి పరిచయం అవుతుంది. మాధవికి కూడా భారతీయ కళలు  అంటే చాల ఇష్టం,  అబిరుచులు, కలిసి బాలు మాధవి దగ్గరి స్నేహితులు అవుతారు.బాలులో దాగున్న ఒక గొప్ప నాట్య కారున్ని చూస్తుంది. ఒక నొక పెద్ద  డాన్సు ఫెస్టివల్ లో బాలు కి అవకాశం వోచెట్టు చేస్తుంది మాధవి.  కాని అనారోగ్యం కారణం తో బాలు  నాట్యాన్ని చూడకుండానే    బాలు అమ్మగారు కన్ను ముస్తుంది. దాంతో  ఆ ప్రదర్శనకి వెళ్ళలేక పోతాడు బాలు. స్నేహం ప్రేమాగా మారి,  ఒకానొక క్షణం లో బాలు తన ఇష్టాన్ని మాధవికి తెలియ చేస్తారు. కాని అప్పటికే మాధవికి పెళ్లి అయిందని, ఓ  కారణం వల్ల వాళ్ళు  విడిపోయారని తెలుస్తుంది. మరోపక్క మాధవి, మనసుతో కుస్తీ పడి ఒక నిర్ణయంతో బాలు ని కలుద్దాం అనుకునేంతలో ..భర్త ప్రత్యక్షం అవుతాడు.   తన తప్పు తెలుసుకొని క్షమాపణ కోసం వొచ్చిన మాధవి భర్తకి... బాలు,మాధవిల విషయం తెలిసి ప్రేమించుకొన్న మనసులు ఒకటి కావటం మంచిదని ఇద్దరినీ ఒక్కటి చేయాలనీ అనుకుంటాడు. కాని బాలు  ఇద్దరికీ నచ్చ చెప్పి ఆ భార్యా భర్తలని అమెరికా పంపించి వేస్తాడు.

అమ్మని కోల్పోయి, ప్రేమని త్యాగం చెసి  ఒంటరి వాడిపోయిన బాలు ..కాలక్రమం లో నాట్యానికి దూరమై  తాగుడుకి దగ్గరవుతాడు. ఆరోగ్యం క్షీణిస్తుంది. కాన్సెర్ తో బాధ పడుతున్న భార్య ఒకవైపు..ఒంటరివాడైన  స్నేహితుడు మరోవైపు ఉన్న  రఘు కూడా నిస్సహాయుడవుతాడు.ఆ సమయంలో అమెరికా నించి తిరిగి వొచ్చిన మాధవికి బాలు పరిస్థితి తెలుస్తుంది.  బాలు ని తిరిగి మములుమనిషిని చేయాలనీ స్నేహితులిద్దరూ  అనుకొంటారు. ఆ ప్రయత్నం  లో మాధవి  రఘు  ద్వారా తన కూతురు శైలజ కి నాట్యం నేర్పే భాద్యతని బాలుకి అప్పగిస్తుంది.
బాలుని ఆ పనికి బలవంతాన ఒప్పిస్తాడు రఘు. అప్పటికే  నాట్య మయూరి గా పెరుతెచుకున్న శైలజకి తాను తాగుబోతుగా భావిస్తున్న బాలకృష్ణ వద్ద మళ్లీ నేర్చుకునే దేమిటి అనే కోపంలో  గురువు గా  బాలు ని అసహ్యించుకుంటుంది .కాని తల్లి బలవంతం వల్ల ఒప్పుకుంటుంది. ఒకరోజు బాగా తాగి ఒళ్ళు తెలీని స్థితిలో నాట్యం చేస్తున్నా బాలుకి, మాధవి ఎదురుపడుతుంది. మాధవి  కూతురే శైలజ అని తెలుసుకొని ఎంతో ఆనంద పడతాడు  బాలు. మళ్లీ  మునుపటి ఉత్సాహం వొస్తుంది.  అకారణంగా బాలుని ఆదరిస్తున్న   తన తల్లికి, బాలు కి ఉన్న సంభందాన్ని అపార్థం చేసుకుంటుంది శైలజ. ఇంకోవైపు  మాధవి సౌభాగ్యం కోల్పోయిందన్న  నిజం తెలియటం తో  బాలు ఆరోగ్యం మళ్లీ దెబ్బతింటుంది.  అంతటి అనారోగ్య పరిస్తితుల్లో కూడా  శైలజకి నృత్యం  నేర్పుతాడు.

 శైలజ నృత్య ప్రదర్శన ఏర్పాటు చేయబదుతుంది .సభకి "బాలకృష్ణ" ని  ఒక మహా కళాకారుడిగా పరిచయం చేస్తుంది మాధవి. జనం చప్పట్లతో  ఆ ప్రాంగణం మారుమ్రోగుతుంది. బాలు హృదయం ఆనందం తో ఉప్పొంగుతుంది, ఒక్క క్షణం ఆ కళాత్మ తాద్యాత్మం చెందుతుంది.
తల్లి పోయిన దుఖం లో మసిబారిపోయిన జీవితానికి తల్లి తరవాత తల్లిగా ఆదరించింది  ఈ "మాధవి" అని  అభివర్నించగానే .. .
 తన తల్లికి ..బాలుకి ఉన్న సంభంధం యొక్క "ఉన్నతి" ఏంటో తెలుసుకొని,  పశ్చాతాపం తో ఆ మహాకళాకారునికి, గురువుకి   మనస్పూర్తిగా  ప్రణమిల్లుతుంది శైలజ. శైలజ నాట్యం చేస్తుంటే అచ్చం  మునుపటి  బాలు కనపడతాడు మాధవికి.
ఓ కళాకారుడిగా పదిమందిలో ఒక్కసారి కూడా  తన కళని ప్రదర్శించ లేకపోయినా,  తన  "నాట్యాత్మ"  ని శైలజ రూపం లో బ్రతికించుకున్న కళాకారుడుగా "నట రాజు పాదాన తల వాల్చనా..నయనాభిషేకాన తరియించనా.." అంటూ కన్ను ముస్తాడు.
మన కళ్ళు తెలియకుండానే వర్షిస్తాయి.
ప్రేక్షకుల దృష్టిని, మనస్సును, భావాన్ని  లగ్నం చేయించి..రససిద్ధి  కలిగించిన సినిమా ఇది. 

అందమైన విగ్రహం, ప్రేమ అమాయకత్వం కలగలిపిన మోము,మాట్లాడే కళ్ళతో కమల్ హాసన్ ఆకర్షనీయంగా కనిపిస్తే , నడివయసు తాగుబోతు  బాలుగా  కమల హాసన్ నటన అపూర్వం..అనన్యం.
తెల్లని మోము. కాటుక తీర్చిదిద్దిన కళ్ళు , వాలు జడ.. అందమైన మాటతీరు ఓహ్ నిజంగా జయప్రద ఈ సినిమాలో కనిపించినంత అందంగా మరే సినిమాలోనూ లేదు. నటన లో కమల్ హసన్ కి ఏ మాత్రం తగ్గలేదు.





సన్నివేశాలు వాటిల్లోని ..అర్థం,  ఆవశ్యకత ..సున్నితత్వం   బావోద్వేగం.. ఇవన్నీ చెప్పగలిగే మేధ నాకు లేదు. చెప్పినా అర్థం కాదు. ఎవరికీ వారు  అనుభూతి చెందాల్సిందే. 
సందర్భానుసారంగా వొచ్చే ఈ చిత్రం లోని పాటలు సంగీత పరంగా ..సాహిత్య పరంగా అజరామరం.
* సినిమా మొదలు అయిన కొన్ని నిముషాల్లోనే... ఓం నమశివాయా... అంటూ శివుడి మీద రాసిన పాట మొదలవుతుంది..ఈ పాట భారతీయ ఆధ్యాత్మిక తత్వాన్ని, దాని నిఘూడత్వాన్ని  ఒక్కసారి గా కళ్ళముందు ఉంచుతుంది.

* "బాల కనక మయ చేల సృజన పరిపాల" అనే పాట ..ఓ పెళ్లి లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక  కార్యక్రమం సందర్బం లో వొస్తుంది.  బాలు అమ్మగారు..తన కొడుకు ని ఒక నాట్య కారునిగా ఉహించుకొని  అబ్బురపడే తల్లి మనసు తెలుస్తుంది.

*  సినిమా నృత్య దర్శకుడి దగ్గర సహాయకుడిగా పనిచేస్తున్న బాలుకి ఒక పాటకి డాన్సు కూర్చే  సందర్భం లో వొచ్చే పాటే .."వేయి వేళ గోపెమ్మలా మువ్వ గోపాలుడే.. ఈ ఒక్క పాటలో  కృష్ణావతార విశేషాన్నిమొత్తం  చెప్పేస్తారు..
(తెరమీద మాత్రం  "తెలుగు సినిమాలో"  పాటని ఎలా ఖూని  చేస్తారో వ్యంగంగా చూపిస్తాడు దర్శకుడు.
కాని నాకు ఆ పాట ఒకవేళ బాలు యే డాన్సు కంపోస్  చేస్తే ఎలా  ఉంటుంది అని ఇప్పటికీ చూడాలని ఉంది.)

*తొలి  రాత్రి సుమతి కి  ( కొత్త జంట రఘుపతి, సుమతి )  బహుమతిగా మాధవి ఒక కాసేట్ ప్లేయర్  ఇస్తుంది. అందులో రఘు రాసిన పాటకి తాను బాణీ కట్టి పాడిన పాట ఉంటుంది. ఆ ప్లేయర్ ఆన్ చేయగానే  వొచ్చే పాటే  " మౌనమేల నోయీ ..ఈ మరపు రాని రేయి"
 ఓ  వ్యక్తీ మీద ఇష్టం ఉన్నపుడు మనకి తెలియకుండానే మనం ఎలా ప్రవర్తిస్తామో..శరీర బాష, చూసే చూపులు...ఆరాట పడే మనసు ఎలా ఉంటుంది అన్న   విషయాన్ని పాటగా రాసారు.దానినే దృశ్యంగా  మలిచిన తీరు ఆహా...ఆది సంగీత ఇంద్రజాలమో..
లేక సాహిత్యపు మాయో.. తెలిదు కాని..  మౌనంగా  మనసులు పాడుకునే పాట వింటాం , మన  మనసుకీ మత్తు కమ్మేస్తుంది.

*బాలు డాన్సు ఫెస్టివల్ కి కోసం చేసుకునే రిహార్సల్ గా ... నాదవినోదము ..నాట్య విలాసము.. పరమ సుఖము పరము ..
అంటూ నాట్య కళా ఆవశ్యకత గొప్పదనాన్ని తెలుపుతూ  సాగుతుంది. పాటకి ముందు చేర్చిన  కాళిదాసు పద్యం తలమానికంగా ఉంటుంది.
* శైలజకి నాట్యం నేర్పటానికి వోచిన బాలు, ఓ  రోజు తాగి, ఒళ్ళు గాల్లో తేలిపోతూ ఉంటే బావిపై డాన్సు చేస్తూ పాడె    "తకిట తదిమి తకిట తదిమి తందానా"... వేదాంతం, తెలియని బాధ..అంతా  పాటలోకి ఒలికింది.

*ఆసుపత్రి లో శైలజకి  నాట్యం నేర్పుతూ మొదలయ్యే  " వేదం అణువణువునా నాదం.. నా పంచ ప్రాణాల నాట్య వినోదం..అనే పాట సినిమా ముగింపుకి  తెర తీస్తుంది. చివరి నిముషాల్లో  ఒక (బాలు) నాట్యాత్మ పడే  తపన గా మొదలయ్యి శైలజ పశ్చాతాపంతో కలగలుపుకొని ... ఆ ఆత్మ శాంతి సాగర సంగమం చెందటం తో అయిపోతుంది.

ఒక్కోపాటకి పాట పరంగా,  అర్థం పరంగా..అంతరార్థం పరంగా, సన్నివేశ  ప్రకారంగా ..ఎంతో ఘాడత  ఉన్నపటికీ.. ఆది అనుభూతి చెందటమే. ఆ సంగీత సాహిత్య సమ్మేళనం ఓ రసామృతధార .. ఎవరి ఆర్తి కొద్ది వారు తాగాల్సిందే  .

  ఈ సినిమాలోని  ఇళయ రాజా గారి కొన్ని రసగుళికలు ( బాక్గ్రౌండ్ మ్యూజిక్ )




"జయంతితే  సుకృతినో రససిద్ధా  కవీశ్వరః  నాస్తి  తేషాం యశఃకాయే  జరామరణజం భయం "
     ( కళలో రససిద్ధి సాధించిన మనిషికి మరణ భయం ఉండదు, అతడు అమరుడు.)

No comments: