Sunday 9 January, 2011

సినిమా - sensibility ( అర్థవంత భావోద్వేగం )


"Transformation of Impression into Expression is art " .
మనచుట్టూ జరుతుగున్న వాస్తవ పరిస్తితులు మనలో ఎలాంటి స్పందన కలిగిస్తున్నాయి. మనం వాటిని ఏ విధంగా స్వీకరిస్తున్నాం తిరిగి ఎలా వ్యక్త పరుస్తున్నాం ?
స్వతహాగా ఫీల్ అయింది మొత్తానికి మొత్తంగా వ్యక్త పరచలేము.ఈ వ్యక్త పరచటం లో ఒక ఫిల్టర్ ఉంటుంది
 - వ్యక్తం-  అనేది మనం పుట్టిపెరిగిన పరిస్తితులు,  మన స్వభావం, చదువు, శిక్షణ , సంస్కారం , అలవాట్లు, , విచక్షణా జ్ఞానం, జనామోద యోగ్యతని ( acceptability )  ఎంచుకోడం  వీటన్నింటి ద్వారా ఫిల్టర్  అయ్యి వ్యక్తం అవుతుంది.  ఇలా  ఒక ఘటన...పరిస్థితికి  emotional and logical గా ఆలోచన చేసి సమయ  సందర్భానుసారంగా అర్థవంతంగా వ్యక్తం చేస్తాం. అలా  వ్యక్తం చేసిన భావోద్వేగాన్నే  "సెన్సిబిలిటీ" అనొచ్చు.
 సినిమాలోని పాత్రలకి సెన్సిబిలిటీ ఉంటుంది. సినిమా చూసే ప్రేక్షకుడికీ సెన్సిబిలిటీ  ఉంటుంది.
 సినిమాల్లోని  పాత్రలు  కథలో జరిగే సంఘటనలకి స్పందించే విధానం సరిగ్గా ఉండి  ప్రేక్షకున్ని కూడా అదే విధమైన భావోద్వేగాలకి లోను చేస్తూ కథా గమనానికి ఉపయోగపడితే  సన్నివేశం బాగా పండుతుంది. ఇదే సెన్సిబిలిటీ. సినిమాల్లో సెన్సిబిలిటీ లోపిస్తే చూడటం కష్టంగా ఉంటుంది. ఆ పాత్రల   ఓచిత్యాలు దెబ్బతిని  వెకిలి గా అనిపిస్తూంది.
రచయిత సెన్సిబిలిటీ ని బట్టి అతను సృష్టించిన పాత్రలు ఉంటాయి. అ కథని తీయబోయే దర్శకుని సెన్సిబిలిటీ ని బట్టి "సినిమా సెన్సిబిలిటీ" ఉంటుంది. 

                       “where drama begins logic ends”. - Alfred Hitchcock’
అబద్దం ఆడితే అతికినట్టు ఉండాలి అన్నట్టు ,  ఎంత నాటకీయత అయినా ఆది sensibility ని అంటి పెట్టుకొని ఉండాలి.  కథ ఎలాంటిదైనా  కావొచ్చు.. horror , fantasy ..science fiction , social satire ..,కాని అందులోఉండే భావోద్వేగాలు మాత్రం ఒకటే.  అ భావోద్వేగాలలో నిజాయితీ  ఉండాలి .ఆది   లోపించినపుడు  సినిమా  దెబ్బతింటుంది.
ఉదాహరణకి ఒక horrer ఫిలింలో ఓ సన్నివేశం  చూస్తున్నాం, పాత్రలకి భయం కలుగుతోంది. ఆది ప్రేకకులు కూడ ఫీల్ కావాలని రచయిత ఆ సన్నివేశం రాసుకున్నాడు, కాని   సన్నివేశం భయం కలిగించటం లేదు,  చప్పగా ఉంది.
సన్నివేశం లో పాత్రలు  భయ పడుతున్నాయి..కాని ప్రేక్షకునికి హాస్యం రావాలి  అని రచయిత  రాసుకుంటే. ..హాస్యం రాలేదు కాని  వెకిలి గా  అనిపించింది.

 సన్నివేశం ఎలాంటి భావోద్వేగం కోసం రాయబడిందో  అలాంటి భావేద్వేగం వొచ్చినట్టయితే, అంటే సన్నివేశం లోని సంఘటనకి పాత్రల స్పందన చూసి ప్రేక్షకుడు కూడ స్పందించి, తక్కువలో తక్కువ convince కావటమో జరిగితే అప్పుడు సన్నివేశం sensibile   గా ఉంది అని అనుకొవొచ్చు.

 సెన్సిబిలిటీ ఎలా వొస్తుంది ?
 రచయిత 
  ఉహాత్మకంగా.. కాల్పనికంగా కొన్ని పాత్రలు వాటి  స్వభావాలు, సంఘటనలు సృష్టిస్తాడు రచయిత. అవన్నీ కలిపి   సినిమా  మొత్తానికి ఉన్న సెన్సు నీ,  ఎస్సెన్సు నీ దెబ్బ తీసేలా ఉండకూడదు. అవి నేల .. గాలి.. గ్రహం... విశ్వం విడిచి సాము చేయకూడదు. సినిమాల్లోని ప్రధాన పాత్రలు ఒక స్వభావాన్ని అంటిపెట్టుకుని ఉండాలి. ఆది ఎంత సహజంగా  ఉంటె అంత మంది ఆమోదం  పొందుతుంది.పాత్ర స్వభావాని బట్టి సంఘటనలు సృష్టించాలి. ఏ సంఘటన అయినా సృష్టించొచ్చు.
మొదట్లో సంఘటనలు పాత్ర స్వభావాన్ని తెలియచేసేందుకు సృష్టించబడి .. తరవాతవి కథా  గమనానికి ఉపయోగపడాలి.అలా కాకుండా పాత్ర స్వభావాన్ని దిగజార్చే విధంగా ఉండకూడదు. ప్రధాన పాత్రల మీద ప్రేమ, గౌరవం, జాలి  లాంటి  పాజిటివ్ భావోద్వేగాలు  కలిగేలా ఉండాలి  తప్ప..ద్వేషం చికాకు కలిపించబడే విధంగా ఉండొద్దు, ఒకవేళ మొదట్లో ఉన్నా తరవాత మెల్లిగా పాజిటివ్ గా మారాలి.
కథలో/ సన్నివేశాల్లో  పాత్రలు స్పందించే తీరుకు ఒక పరిధి ఉంటుంది, ఆ  పరిధి  దాటి ప్రవర్తిస్తే సెన్సిబిలిటీ లోపిస్తుంది.
మన సినిమాల్లో   హీరోఇసం  పేరుమీద ఈ సెన్సిబిలిటీ నీ తుంగలో తొక్కేసి విచిత్రమైన సన్నివేశాలు  రాస్తున్నారు.  హీరోలు  ఈ సెన్సిబిలిటీ ని ఏమాత్రం ఆలోచించక  "కనీస పరిజ్ఞానం" లేకుండా అలాంటి  సన్నివేశాల్లో  నటించేసరికి  అభిమానులకి / ప్రేక్షకునికి నవ్వాలో ఏడవాలో అర్థం కావటం లేదు.

సెన్సిబిలిటీ లోపం -  ఒక ఉదాహరణ
 పవన్ కళ్యాన్  నటించిన పులి సినిమా లో హీరోయిన్ పాత్ర  గురించి మాట్లాడుకుందాం,
ఆ పాత్ర సృష్టి , సన్నివేశాలు సినిమాని బాగా దెబ్బ తీసాయి అనటం లో ఏ మాత్రం సందేహం లేదు. పవన్ పాత్ర బాగా సీరియస్ గా ,  ఎంతో దేశభక్తి గల్గిన పాత్రగా రాయటం లో కొంత  సఫలమైన రచయిత హీరోయిన్ విషయం లో కేవలం హీరోని ఆకట్టు కోవాలని..ప్రేమని పొందాలని తపన పడే పాత్ర గా రాసుకున్నాడు.  కాని  ఆ ఇష్టంలో, ప్రేమలో  సహజత్వం , నిజాయితీ లోపించి  వెకిలిగా ఒక  "వ్యక్తిత్వం"  లేని పాత్రగా అయ్యింది . హీరో, హీరోయిన్ ల మధ్య జరిగే  సన్నివేశాల్లో " సీరియస్ పాత్ర" అయిన హీరో హీరోయిన్ వెకిలి చేష్టలకి  ఎలా స్పందిచాలో తెలియక తిక మక పడతాడు. బహుశ  ఈ సన్నివేశాల  ద్వారా హాస్యం వొస్తుందేమో అనుకొని రాసినట్టు ఉన్నాడు, కాని రాలేదు.  ఒక పెద్ద పోలీసు ఆఫీసర్,  అలా అమ్మాయి వెకిలి చేష్టలకి పడిపోయి..ముద్దు పెట్టటం,,తాళి కట్టటం జరిగిపోతాయి.  ఈ  సన్నివేశాలన్నీ చాల ఎబ్బెట్టుగా ఉంటాయి. దీనినే  సెన్సిబిలిటీ లోపించటం అని చెప్పొచ్చు. ఉదాత్తంగా ప్రవర్తించే హీరో పాత్ర అప్పటికప్పుడు వెకిలిగా ప్రవర్తించలేక.. ఎంత హాస్యం పండించాలనుకున్నా, ఎంత సినిమా నాటకీయత అనుకున్నా.. ఇది వర్కౌట్ కాలేదు, కాదు. అంత పెద్ద హీరో పాత్ర ఇలా వెకిలి తనం  ప్రదర్శించటం వల్ల sensibility దెబ్బ తిన్నది.
చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు ..ఎన్నో సన్నివేశాలు.
సెన్సిబిలిటీ ఉండటం   -   ఒక ఉదాహరణ 
పాత్రలు మలిచిన తీరు,   సన్నివేశాలకి అనుగుణంగా ప్రవర్తించిన తీరు సరిగ్గా ఉండి తద్వారా  సినిమా sensible   గా ఉంది అని చెప్పుకోటానికి  ఘర్షణ ( కొత్తది ) ఒక ఉదాహరణగా తీసుకోవొచ్చు.  అందులోనూ   ఒక పోలీసు ఆఫీసర్ (వెంకటేష్) కి  ఆసిన్
తారస పడుతుంది. ఏదో బలమైన ఆకర్షణ మొదలవుతుంది . అలా పదే పదే తారస పడి..  ఇద్దరి మధ్య ఒక రసాయన భంధం
( కెమిస్ట్రీ ) ఏర్పడుతుంది.
హీరో అలాంటి  అమ్మాయికి ఆకర్షింపబటటం లో మనకి ఎలాంటి సందేహాలూ రావు.పాత్ర పరంగా, సన్నివేశ పరంగా, చిత్రీకరణ పరంగా, ప్రేక్షకుని పరంగా  చూడటానికి చాల pleasant గా అనిపిస్తూ.. ప్రేక్షకునిని convince చేస్తుంది.
 నిజాయితి గల పోలీసు ఆఫీసర్ పాత్ర ,సహజంగా, సరళంగా  గా ఉండే అమ్మాయి ఆకర్షణ కి లోనుకావటం లో .. ఒక సెన్సిబిలిటీ కనిపిస్తుంది.
దర్శకుడు 
తనే స్వయంగా రచన చేయటమో లేదా తన ఐడియా కి  రచయితని ఎంచుకోవటమో, లేదా  రచయిత రాసిన కథని తను  ఎంచుకోవటమో చేసేది దర్శకుడు. అయితే రచయిత అనుకున్న విధంగా కాక ..వేరేవిధంగా visualization  చేయటం, చిత్రీకరించటం వల్ల ఈ సెన్సిబిలిటీ దెబ్బ తినే ఆస్కారం ఉంది. కనక , రచయిత ఆ సన్నివేశం లో ముఖ్యంగా ఏం చెప్పదలచుకున్నాడో   అ భావోద్వేగం పస్పుటం అయ్యేలా చిత్రీకరించాల్సి ఉంటుంది.సన్నివేశం లో రాసిన భావాన్ని ప్రేక్షకులు అనుభూతి చెందేలా  చిత్రీకరించగలగాలి. ఇదే దర్శకుని పనితనం.
 ప్రేక్షకుని  పరంగా
ప్రేక్సకుడి సెన్సిబిలిటీకి ,  సన్నివేశలో సెన్సిబిలిటీకి  లో సమన్వయం కుదిరినపుడు ప్రేక్షకుడు భావోద్వేగం పొందుతాడు

ప్రతి మనిషి   లోపల ఇంకో మనిషి ఉంటాడన్న విషయం మనకి తెలిసిందే.బయటికి కనపడే మనిషి , లోపలి మనిషి. ఈ ఇద్దరి స్వభావాల్లో మార్పు ఉంటుంది. బయటికి హాస్య చతురుడు గా ఉన్న వ్యక్తి లోపల గంభీరం ఉండవచ్చు. బయటికి సామాన్యుడిలా కనిపించే వ్యక్తి గొప్ప త్యాగ శీలుడై ఉండవచ్చు.  బయటికి  పిరికి వాడుగా కనిపించే వ్యక్తి లోపల గొప్ప  దైర్యశాలి అయి ఉండవొచ్చు.
 ఈ ' బయటి లేదా లోపలి వ్వ్యక్తి' ని  సంతృప్తి పరిచే విధంగా పాత్రలు , కథలు తయారు చేసినట్టయితే  ప్రేక్షకుడు సినిమా లో మమేకం అయిపోతాడు . నిజ జీవితం లో చాల మంది ఇలా ఉండాలి/ అలా ఉండాలి అనుకుంటారు , కాని ఉండలేరు. కాని తాను చూసే సినిమాలోని ప్రధాన పాత్ర తాము ఎలా ఉండాలి అనుకుంటారో  అలా ఉన్నపుడు, లేదా అదే విధంగా ప్రవర్తిస్తున్నపుడు...ప్రతిస్పందిస్తున్నపుడు  తమని తాము ఆ ప్రధాన పాత్రలోకి దూరిపోయి  ఆ పాత్ర తో పాటు తామూ  అలాగే ఫీల్ అవుతూ.. సినిమా ని బాగా అనుభూతి చెందుతారు

చివరి  మాట 
విద్యార్థి పరిక్ష పేపర్ దిద్దుతున్నపుడు, ఎంత తప్పుగా రాసినా , ఎన్ని తప్పులు రాసినా వదిలేసి ,  ఏ మాత్రం  సరిగ్గా రాసినా మార్కులు ఇవ్వాటానికి రెడీ గా ఉన్న ఉపాధ్యాయుడిలా  .. ప్రేక్షకుడు కూడ  సినిమాని అర్థం చేసుకొని ..కొన్ని సార్లు సెన్సిబిలిటీ లోపించినా.. పట్టించుకోక.. అందులో ఏమూలయినా ఒకింత   సరయిన బావోద్వేగం ఉన్నా ఫీల్ అయ్యి మార్కులు ఇవ్వటానికి రెడీ గా ఉంటాడు.
 అయినప్పటికీ మార్కులు రావటం లేదంటే  .. మరి లోపం ఎక్కడుందో  రాసేవాళ్ళకే/ తీసేవాళ్ళకే   తెలియాలి.

చక్రధర్
chakinet@gmail.com




..

1 comment:

గీతాచార్య said...

బాగా వ్రాసితిరి చక్రధరా!